పూలు-స్త్రీలు





ఎందుకీ వేదన? దేనికోసం నీ శోధన ?

పదేపదే మకరందానికై నీ చెంతచేరే
తుంటరి తుమ్మెద కోసమా?
అయితే అది రాదు.
తేనెలూరని నీ తనువుతో దానికిక పనిలేదు.


తలపని, వలపనీ, అనురాగమనీ, ఆప్యాయతనీ...
నీ చుట్టూ తిరిగిన తూనీగలకోసమా?
అయితే, అది కూడా రాదు.
రంగు కోల్పోయిన నీ పూల రెక్కలతో దానికేఅవసరమూ లేదు.


కనువిందులు చేయడానికని వేషాలు మార్చి
నీపై వాలే రంగుల సీతాకోక కోసమా?
అయితే, అదికూడా ఖచ్చితంగా రాదు.
నేల రాలిన నీ పుప్పొడితో దానికే ఉపయోగమూ లేదు.


నిస్వార్థంతో నీ పరిమళాన్ని నలుదిక్కులకూ వెదజల్లి
నీ రెక్కలు రాలిపోయినా, నువు రంగులు కోల్పోయినా,
ప్రేమగా నిను స్పృశించి పరామర్శించే
స్వచ్చమైన గాలి కోసమా?
అతితే నువు దిగులు పడాల్సిన అవసరం లేదు.
అసలు ఎదురుచూడాల్సిన పనికూడా లేదు.
ఎందుకంటే, అది నీకు కనిపించడంలేదు కానీ ఇంకా నీ వెంటే ఉంది.
ఆప్యాయతతో నీ చుట్టూనే తచ్చాడుతోంది.


                                                                                                                   28/09/2013

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...