ఆకలాట





ఈ దేవుడింతే! అన్నిట్లోనూ తిరకాసే.
ఆకలి.
ఇక్కడా పెట్టాడు. దీన్నీ వదల్లేదు.
అసలు దేన్నీ వదలడేమో !

ఆకలి గొప్ప వరం కొందరికి
అంతకంటే గొప్ప శాపం మరికొందరికి

దోపిడీలు, దొంగతనాలు..
యాచనలూ, మోసాలూ...
ఆకలి కడుపులకు అన్నీ లోకువేలే!
అది తీరకపోతే కడుపులో పిడిబాకులేలే !!

వెన్నంటిన పొట్టొకడిది.
ఆకలంటే ఆకలంటూ అరుపెందుకో?
పెడితే ఎక్కడ దాచుకుంటాడో !
అసలు పొట్ట జాడేలేదు.

బానలాటి పొట్టొకడిది.
ఆకలో ఆకలి.. ఇక్కడా అదే అరుపు.
ఇంకెక్కడ పెట్టుకుంటాడో!
ఎంత తిన్నాడో నిండు కుండలా ఉంది.

లావూ సన్నం; పొట్టీ పొడుగూ..
పూట పూటకీ కలవరపెట్టే మాయరోగమిది.
ఎవ్వరినీ వదలకుండా వ్యాపించే
అంతుచిక్కని వైరస్ ఇది.

కోటి విద్యలకు జీవం పోసే అదృశ్య శాసనమిది.
ఎన్ని కండల్నైనా కరిగించే కర్మకారిణి ఇది.

అన్నం కోసం కొందరి ప్రయాసలు
తినీతినీ ఇంకొందరి ఆయాసాలు.
అన్నీ అరుపులే!
ఒక్కో అరుపులో ఒక్కో వైవిధ్యం.
అమ్మా ! అని ఒకడు
కమ్మగా ఉందని ఒకడు.
ఆ.. అంటూ అరుపులు కొందరివ్వి.
ఆహా .. అంటూ ఆనందాలు ఇంకొందరివి.

పట్టెడన్నం కోసం ఆరాటపడటమో శాపం.
అన్నీ ఉండి వృధా చేయడమో వరం !

ఆకలి కోసం చావును వెదికే చీకటి కోణాలెన్నో..
వీదుల్లో నడిచెళ్తుంటే తారసపడే కన్నీటి గాధలెన్నో...

మనం తోటివారికి చేసే సహాయాలు
మానవత్వపు జాడలకు నిదర్శనాలు.

ఆజాడలు చెరిగిపోకుండా
మానవత్వపు పట్టుకొమ్మలు ఎండిపోకుండా
మనం మనుషుల్లా ప్రవర్తిద్దాం!
మనసుల్ని మనసుల్తోనే జయిద్దాం !!
ఆకలి బాధలను తీర్చేద్దాం !!!

                                                                        12/09/2013

1 comment:

Related Posts Plugin for WordPress, Blogger...