ప్రాపంచికం!!


ఎందుకో ఈ ప్రపంచం
నీది నాదీ కాదనిపిస్తోంది...
నాల్కలపై కొన్ని రంగులు అద్దుకొని
పెద్ద పెద్ద ప్రవచనాలతో గద్దించే
రంగురంగుల మనుషుల అద్దెకుటీరమనిపిస్తోంది...
రక్తాన్ని..చెమటనీ..మెదళ్లనీ ఓపిగ్గా ఒంపి
బ్రతుకునిచ్చిన నేల దాహాన్ని తీరుస్తున్న
అసలైన యజమానుల స్మశానవాటికనిపిస్తోంది...
ఎందుకో ఈ ప్రపంచం
పొడిబారిన ఏడారుల్లో
అందంగా కనిపించే త్రాచుపాముల గుట్టలా...
మందుపెట్టి ఆకట్టుకునేలా పేర్చబడ్డ
పచ్చి మావిడిపళ్ల బుట్టలా...
ఎప్పుడు తెగిపోతుందో తెలియని
ఆహ్లాదకరమైన నిండు చెరువు గట్టులా...
అప్పుడే చీకటిని దాటుకుని వెలుగులోకి వచ్చిన
నీ నా కళ్ళకి చాలా నచ్చేట్లు కనిపిస్తోంది...
నిజానికి ఈ ప్రపంచం
నిన్నూ నన్నూ రంజింపజేయడానికి
ఎంతో కష్టపడుతూ అందమైన వినాశనానికి
ఆతృతతో దారులు పరుస్తోందో
ఒక్కసారి తనివితీరా చూడవూ....

1 comment:

  1. నాల్కలపై కొన్ని రంగులు అద్దుకొని
    పెద్ద పెద్ద ప్రవచనాలతో గద్దించే
    రంగురంగుల మనుషుల అద్దెకుటీరమనిపిస్తోంది...మీరు ఇలా వ్రాసి ఎప్పుడూ మనసు దోస్తారు.
    ఇకపై క్రమం తప్పకుండా వ్రాయండి మాలాంటి వారి కోసం.

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...