నాకు దేని గురించీ తెలియదు.
ఏవేవో శ్రుంగ ద్రోణులు ఇమిడిన గాలి తరంగాల్లో
అప్పుడప్పుడూ కొన్ని తీగలు అలా మెరుస్తాయి.
మెరుపో మానవాతీత మ్యాజిక్కో
నా మెదళ్లో ఒక్కసారిగా జిమ్నాస్టిక్ చేసినప్పుడు;
వింత భావాల అలజడి చలరేగుతుంది.
తెలియకుండానే గుండె కరుకైపోతుంది.
శూన్యం నుండి ఆకలి దప్పికలు
విస్పోటనం నుంచి శాంతి సమూహాలు
గాల్లో ఈకలు తేలినట్లు
కలంలో ఇంకు అలా ప్రవహిస్తూనే ఉంటుంది.
విశాల విశ్వంలో దాగిన మర్మాలను
నిర్విరామంగా శోధిస్తూ.. ఏవేవో సాధిస్తూ..
అనంత గరళ గొంతుకల్ని
అమాయకపు సరళ ఘోషల్ని
రొమ్ము విరుస్తూ.. రెప్ప కదుల్చుతూ..
విష్వక్సేనుడొకడు ఉన్నట్లుండీ ఒళ్లోకోస్తాడు.
ఏవేవో ఎడతెరిపిలేకుండా లిఖిస్తూ..
బ్రహ్మాండాన్నే చుక్క సిరాలో బంధిస్తూ..
అలా వచ్చి వెళ్ళిపోతాడు.
తర్వాత అంతా శూన్యమే!
ఇప్పుడు నాకేం తెలియదు.
కొద్దో గొప్పో రుచి గల ముద్ద పప్పుని.
అసలు నేనొక మట్టి ముద్దని.
అందుకే నాకంత ఆత్రుత.
ఎప్పుడెప్పుడు ఫ్రేం లోంచి బయట పడదామని.
అసలు నాలో ఏం జరుగుతోందో తెలుసుకుందామని.
25/11/2013
No comments:
Post a Comment