నిర్భాగ్యుడి తలపు...

అప్పుడెప్పుడో వెన్నెల గిలిగింతలకు ఆకాశం ఆహ్లాదంగా నవ్వితే
రాలిపడ్డ ముత్యాలనేరుకూంటూ నిన్ను మొదటిసారి చూశాను.

మంత్రమేసినట్లు నా కన్నులు నిన్నే చూస్తూ ఉండిపోయాయి.
చేతులు వశం తప్పి నీకెప్పుడర్పించేశాయో నే పోగేసిన ముత్యాల్ని.

నా అణువణువూ నిండిన నిశ్శబ్ధం నీ అందానికి దాసోహమయ్యి
ఒక్క మాటా పలుకలేక మౌనంగా నీ ధ్యానానికి అలవాటుపడింది.

ఇలా తలిస్తే చాలనుకున్నావేమో! అసలు కనిపించడమే మానేశావు.
ఎక్కడా వెతకనవసరం లేకుండా నా కన్నుల్లోనే నిక్షిప్తమైపోయావు.

మళ్ళీ ఇన్నాళ్ళకి, నవ్వుతూ ఉండే ఆకాశాన్ని ఎవరేడిపించారో ఏమో!
ఇప్పుడు ముత్యాలకు బదులు వడగండ్లనూ పిడుగుల్నూ రాలుస్తోంది.

ఇప్పుడైనా నీ ధ్యానంలోచి బయటపడదామంటే గుండెల్లో ఏదో భయం.
పిడుగుల్నైనా ఏరుకుని దాచుకోగలనేను ఎక్కడ నీకర్పిస్తానేమోనని.

17/11/2013


No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...