కొట్టుపోవడమే...

సహజంగానే అప్పుడెవరూ లేరు
నిజంగానే నే పుట్టకముందెవ్వరూ లేరు

నిశీధితో సాహసం చేసిన అదృశ్యం తప్ప
శూన్యంతో సావాసం చేసిన నిశ్శబ్ధం తప్ప

విశ్వమంతా నిశ్చలత్వమే
ప్రపంచమంతా అంధత్వమే
సమస్తమంతా ఏదో ఒక తత్వమే

ఏ జన్మలో ఏ అమ్మ దాచిపెట్టిన పురుటినొప్పులో
పుట్టగానే చెమ్మగిల్లిన కళ్ళు ఏడ్చేస్తాయ్

శిలల్లో ఉప్పొంగే అలల ఆటుపోట్లు
అలల్లో తప్పిపోయే కలల కునికిపాట్లు
కలల్లో తెప్పదాటే కళల పనిమూట్లు

ఏ మేఘం పొట్ట పగిలితే రాలిపడ్డాయో
ఏ వైభవం మట్టికరిస్తే తూలిపడ్డాయో
అసలివన్నీ ఎలా కింద పడ్డాయో!!

కళ్ళు తెరిచీ తెరవంగానే హత్తుకున్న ప్రకృతి
ఊహ తెలిసీ తెలవంగానే అద్దుకున్న సంస్కృతి

ఏది బంధమో బానిసత్వమో తేల్చే సత్యాలెక్కడ?
ఏది బాధో బహుమానమో కొల్చే కొలమానమెక్కడ?

విధి విధిల్చే వేదనలో విశ్వాసాన్నెత్తుకుని
కాలం కాల్చే సహనంలో సంతోషాన్నెతుక్కున్ని

అతక్కుండా ఆగకుండా
కొట్టుకుపోవడమే నా పుట్టుక ప్రయాణం

24/11/2013


No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...