ఇద్దరూ కరుణించరా?

ఎడతెరిపిలేకుండా కన్నీరు కారుస్తూనే ఉన్నా!
అది నీ పల్లానికి చేరి సెలయేరైతే
ఈదుకుంటూ నిన్ను చేరదామని.

నిస్సహాయంగా నిట్టూర్పులొదులుతూనే ఉన్నా!
అది చిరుగాలై నీ శ్వాసను చేరితే
మెల్లగా నీలో ప్రవేశిద్దామని.

నిర్విరామంగా సమయాన్ని నిందిస్తూనే ఉన్నా!
అది నీ జ్ఞాపకాల తీరం చేరితే
నేనూ అదృశ్యమై నీ ముందు వాలదామని.

అయినా ఏం లాభం? ఈ ప్రకృతి కనికరిస్తే కదా?
కరుణజూపి నాపై ప్రేమ కురిపిస్తేకదా?

ఎంత ప్రకోపించినా దీనికి పరిహసించడమే తెలుసు.
ప్రశాంతతనివ్వాలని మాత్రం తెలియదు.

ఎంత వేడుకొన్నా విని వదిలేయడమే తెలుసు.
వేడుక చేసుకొమ్మని వరమివ్వడం తెలియదు.

ఎంత పరితపిస్తున్నా పరీక్ష పెట్టడమే తెలుసు.
ప్రేమ భిక్ష పెట్టాలని మాత్రం తెలియదు.

ఎంత కాదన్నా..
నీ అనురాగం ఒక తీయని బాధ
కావాలనే నను కమ్ముకునే తీరని వ్యధ
నను కలకాలం నడిపించే తరగని సుధ

అందుకే నువ్వూ ఆ ప్రకృతీ ఏదీ నను కనికరించకున్నా
కాశాయం ధరించక, కమండలం పుచ్చుకోక..
నువు సేదతీర్చిన ఒడిని తలుచుకుంటూ
జ్ఞాపకాల బడిలో భగ్న ప్రేమికులందరికీ
ప్రేమ పాఠాలను బోధిస్తున్నా...
నీ తలపుల్నే నెమరేస్తూ జీతంగా పుచ్చుకుంటున్నా...

06/11/2013



No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...