నాకేమాత్రం అభ్యంతరం లేదు. నరికేయ్.



గొడ్డలి వేటు పడగానే చెట్లూ బిగ్గరగా అరుస్తాయ్..
మనకు మాత్రం వినపడవ్!
గొడ్డలి జరిపాక మనసుతో చూస్తే కనపడతాయ్..
అరుస్తూ రోదించే నోర్లెన్నో!

వాటి బాధ ఎంత భయంకరంగా ఉంటుందో!
వినలేక విహంగాలన్నీ దానిపైనుండి ఎగిరిపోతాయ్.

వాటి సంతోషం ఎంత ఆర్ద్రంగా వీడుతుందో!
దెబ్బ దెబ్బకీ బెరడు ముక్కలు రాలి వీడ్కోలు పలుకుతాయ్.

వాటి కన్నీరు ఎంత గాఢంగా స్రవించబడతాయో!
ఏడ్చీ ఏడ్చీ జిగురుతో గాయల్ని కప్పెట్టేసుకుంటాయ్.

జే.సి. బోస్ రాసిన బుక్కులు చదవక్కర్లేదు.
చిన్నప్పటి సైన్సు పుస్తకాలూ తిరగేయనక్కర్లేదు.
ఒక్కసారి నిన్ను నువ్వే గిల్లుకుని అద్దంలో చూసుకో.

ఇంకా నరకాలనిపిస్తోందా?
అయితే నిర్మొహమాటంగా నరికేయ్.

అమ్మొక్కసారే నీకూపిరి పోసీ జన్మనిచ్చింది.
మరి ఇన్ని రోజులూ నీకెవరు ఊపిరి పోస్తున్నారో
రెండే రెండు నిమిషాలు ఆలోచించి
తర్వాత మొత్తంగా నరికేయ్.

నాకేమాత్రం అభ్యంతరం లేదు. నరికేయ్.

20/11/2013

2 comments:

Related Posts Plugin for WordPress, Blogger...