నువ్వు గుండె గడపమాను దాట్న్యాక...



ఈ మధ్యగాల
గుండె కాడ షానా నొప్పిగుంటాంది
నువ్వేమన్నా తల్చుకుంటాండావా...

అమ్మలపొద్దున స్నానం చేస్కునేదానికి బాయికాడ పోతే 
కంది శెట్ల సందుల్లోంచి తొంగిజూసిన 
నీ చూపులు గుర్తొస్తాండాయి...

పైటాల అన్నం శరవ తీసి బువ్వ పెట్టుకుంటాంటే 
నువ్వు ఎంగిలి ముద్దులతో కలిపి పెట్టిన 
సంగటి ముద్దలు చానా గుర్తొస్తాండాయి...

మాయటాల గొడ్లకు మేత కోసేదానికి కొడవలితీస్తే
సానబట్టిన భాగమంతా తెల్లగా మెరుస్తా 
నువ్వు పళ్ళెకిరిస్తూ నవ్వుతాన్యట్టుంది...

పొద్దుగూకినాక పొయ్యి ఎలిగించాలని 
గబ్బునునే పోసి అగ్గిపుల్లేస్తె ఆ ఎర్రటి మంటల్లో 
నీ నుదుటి బొట్టు నాకు కన్నుగొడతావున్యట్టుంది...

రోజూ పంపుసెట్టు యేసి నీళ్ళు పట్టనుపోతే 
గలగలా పారే నీ మాటలు వొక్కటే గుర్తొచ్చి 
నా కడ్లంబడి నీళ్లొచ్చి పైరంతా తడుస్తాండాది...

ఎంగిలి మింగుతావున్యా పొలమారతాంది
నన్ను అంతగా తలచుకోకు అమ్మీ
నువ్వు ల్యాకుంటే నా పాణెం పోతావుండాది....

ఈ పండక్కి నీ సమాధికాడనే కుమిలిపోతాండా 
హాయిగా నీ వొళ్ళో తలబెట్టుకొని పండుకున్యట్టుంది
నన్ను కూడా బిర్నా నీకాడికి రానిచ్చుకోయే...

8 comments:

  1. సుపర్ రాసినావ్ బ్రదర్.

    ReplyDelete
  2. కొత్త పంథాలో ప్రేమను మనసుకు తాకే విధంగా రాసినారు.

    ReplyDelete
  3. వాహ్ వా...వినోద్ ఇన్ని కళలు ఉన్నాయా నీలో :-)

    ReplyDelete
  4. ఎట్టెట్టా...సూపర్గా రాసారు.

    ReplyDelete
  5. మరో మారు పాత విశ్వక్సేనుడి అవతారం కవితలో చూపించారు.

    ReplyDelete
  6. చాలా చక్కగా చిత్రీకరించారు కవితలో చరిత్రని.

    ReplyDelete
  7. అందంగా చెప్పావు భావాన్ని నీ భాషలో. బాగుంది వినోద్

    ReplyDelete
  8. ఔ.. జర్ర జర్ర అట్లనే అగుపిస్తా ఉండాది..
    యెడబాటును సైతం కవితల అల్లిన తీరు బాగుంది..
    ఎందుకనో దుఃఖం పొంగి పోర్లుకుంటా ఉండాది..
    కమెంట్ రాస్తూనే కన్నీటి సంద్రమై మొబైల్ స్క్రీన్ తడిసినాది వినోద్ గారు..
    మరి కవితలోని భావమో లేక వర్ణించిన తీరో ఎటదులోనో వేదన కొట్టోచ్చినట్లు ఉంది..

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...