ఎవరు చెప్పారు నీకు?

ఎవరు చెప్పారు? నేను ప్రశాంతంగా ఉన్నానని.
ఎప్పుడూ ముత్యంలా మెరిసే నా నవ్వా?
నన్ను చూసి మురిసిపోయే ప్రతి పువ్వా?

నన్నూ నా నవ్వునూ చూశానన్నావ్! సరే,
సముద్రాన్ని చూశావా? నువ్వూ
తీరం వెంబడి నడిస్తే నీ కాళ్ళను స్పృశించి అది మైమరచిపోతుంది.
అదే కాళ్ళతో ఒక్కసారి హద్దుమీరి చూడు.
కెరటాలతో వెంబడించి మరీ చంపుతుంది.

అప్పుడైనా నీకు అర్థమౌతుందో లేదో!
సముద్రం ఎంత ప్రశాంతంగా ఉంటుందో!
చావు ఎంత భయంకరంగా ఉంటుందో!

నేను అణుబాంబును కాను.
ఆనందం మాటున అణుబాంబును దాచుకున్న చిన్ని రేణువుని.
వినోదాలు పంచుతూ
విషాదాన్ని దిగమింగుకునే దేశదిమ్మరిని.
దేన్నైనా ఎదుర్కోగల ధైర్యశాలినే కానీ అశృపిపాసిని.

అనుభవించింది ఇసుమంత జీవితమే.
ఆకళింపు చేసుకున్నది మాత్రం అనంతమే.
అందుకే సంతోశాన్ని పంచుతూ వెళ్తాను.

అయినా నీకేం? నీ ప్రయాణం సాఫీగా సాగుతోందని అంటావా?
చిరునవ్వుతో చిందేస్తున్నావంటావా?

అయితే విను...
అన్నీ మలుపులే అలుపెరుగక సాగే నా ప్రయాణంలో
అన్నీ కలుగులే అనంత గునపాలు దిగిన నా హృదయంలో

ఎన్నిసార్లు నా గుండె కన్నీటి బొట్టై రాలిపడలేదూ
ఎన్ని కనిపించని గాట్లు మనసును తూట్లు పొడవలేదూ
ఎన్ని ఉద్వేగాగ్నిపర్వతాలు నాలో బద్ధలవ్వలేదూ
ఎన్ని నిశ్చల జలపాతాలు నాలో ఉప్పొంగలేదూ

నాకూ ఉన్నాయ్ కలతలూ కన్నీళ్ళూ
నాకూ ఉన్నాయ్ బాధలూ బంధాలూ

నా గుండెలోనూ పగిలిన గాజుముక్కలెన్నో గుచ్చుకున్నాయ్
నా మెదడులోనూ తుప్పుపట్టిన నాడీ కణాలెన్నో నిర్వీర్యమయ్యాయ్

నా ఆనందంలోనూ విశాద చాయలున్నాయ్
నా విషాదంలోనూ ఆనంద పరిమళాలున్నాయ్

నానుండి విడిపోకముందే నాత్మ చెప్పిన నిజమొక్కటే
నేను నేను కాదనీ ... నేనసలు లేనే లేననీ ...
నేను నాకోసం కాదనీ ... నాకోసం ఏదీ లేదనీ ...

ఇప్పుడు చెప్పు. నేను ప్రశాంతంగా ఉన్నానా?

06/11/2013


No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...