రెక్కలు మొలవాలా?

రెక్కలు లేవని బాధపడతావెందుకు?
ఉన్న కోళ్ళు ఎగురుతున్నాయా?
బద్దకించిన బాతులు విహరిస్తున్నాయా?

లేని మేఘాలను చూడు
దుమ్ము కణాల ధైర్యాన్ని చూడు
ఉన్నవే కావు లేనివెన్నో ఎగురుతున్నాయి చూడు.

చింతలను మరుపు దొంతెరలతో కప్పేయ్
జ్ఞానం కోసమే తప్ప
జ్ఞాపకాలకోసం అందులో తొంగి చూడకు.

గమ్యమంటారందరు.. దాని కోసం వెదక్కు.
నీ గమనంలో నిమగ్నమైపో
సరికొత్త రంగుల లోకం నీకోసం తెరుచుకుంటుంది.

ఎన్నో నదులూ పర్వతాలూ అడ్డొస్తాయి
అన్నీ అందమైనవే. ఆహ్లాదంతో పాటూ విషాదాన్నీ మిగుల్చుతాయి.
ఐనా సరే ఆలోచనల వంతెనలను నిర్మించి
చిరు నవ్వుతో అన్నిటినీ దాటేయ్.

సహనమనే ఆయుధాన్ని చేతపట్టి
సరిహద్దు లేని సంద్రాన్ని నీలో ఇముడ్చుకో.

అప్పుడు మొలుస్తాయ్ రెక్కలు
నీకు కాదు నీ హృదయానికి.
విహరిస్తావు. విశ్వంలో కాదు.
నలుగురి హృదయాల్లో.. నాలుగు తరాల నడకల్లో.

19/10/2013

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...