నా కవిత్వపు గురువు కిటికీ





ప్రతీ ఉదయం ఆఫీసుకని ఆర్టిసి బస్సేకుతాను
ఆ బస్సులో నా కోసం ఎదురుచూస్తూఉన్న కిటికీ పక్కకెళ్ళి
చిన్నగా నాతల దానికానిచ్చి కూర్చుంటాను.
నేను ప్రయాణించే డెబ్బయి నిమిషాల సమయంలో
ఆ కిటికీ నాకు కవిత్వపు పాఠాల్ని బోధిస్తుంది.

కండెక్టర్ వద్ద విసిల్ మ్రోగి, బస్సు బయలుదేరగానే
రకరకాల దృశ్యాలను చూపి భావాల డిక్టేషన్ రాయమంటుంది.
ముందుగా తన అద్దంలో నన్నే చూపించి నీకు నువ్వే గురువంటుంది.
చుసిన ప్రతిదాన్నీ మనస్సుతో నూతనంగా ఆవిష్కరించాలని,
ఆలోచనలకు అక్షరాలతో పదును పెట్టాలని పదేపదే హెచ్చరిస్తూఉంటుంది.
నేను నిత్యవిధ్యార్తినై శ్రద్ధగా ఆ దృశ్యాలను గమనిస్తూ వెళ్తాను.

తట్టలో ఎన్నో రకాలుగా అడుక్కునే బిచ్చగాళ్ళని,
అదే తట్టలో ఏదోఒకటి అమ్ముకుంటూ బ్రతికే చిరువ్యాపారుల్ని చూసి
కూడళ్ళలో పనికోసం కాపలాగాసే వందల కూలీలను చూసి
ఆకలి కవిత్వం రాస్తాను. శ్రామికుల స్వేదాన్ని నా సిరాలో పోసి
వారి కష్టాన్ని అక్షరాలుగా మారుస్తాను.

బస్సు అలానే ముందుకువెళ్తూ ఊరవతల బస్టాప్ లో ఆగుతుంది.
అక్కడ రోజూ ఎదురుచూసే ఒకమ్మాయి బస్సేక్కుతుంది.
నన్ను చూసీచూడనట్టు నా ముందు సీట్లోనే కూర్చుంటుంది.
తన వాలుజడను సవరిస్తూ, పూలను సర్దుకుంటూ ఆమె చూసే ఓర చూపులు చూసీ
ప్రేమ కవిత్వం రాస్తాను. ఆమె దిగాల్సిన చోటువచ్చి దిగిపోతుంటే
విరహ గరళాన్ని కాగితాలపై పోస్తాను.

బస్సు ఎన్నో చిన్న చిన్న పల్లెలు దాటుకుంటూ వెళ్తుంది.
సేద్యం చేస్తూ, పచ్చని పొలాలకు మందు చల్లుతూ, కలుపు మొక్కల్ని ఏరిపారేస్తూ
సన్ననికడుపుతో ఆహ్లాదంగా పనిచేసే రైతన్నలను చూసి
రైతు కవిత్వం రాస్తాను. అక్కడ పండిన ప్రతీ బియ్యపు గింజలపై
వాళ్ళ పేర్లను చెరిగిపోని రంగుతో లిఖిస్తాను.

బస్సు కొంచెం వేగం తగ్గి గువ్వలచెరువు ఘాట్ మార్గం గుండా వెళ్తుంది.
ఎన్నో ఉద్యానవనాలను ఒకచోట పేర్చినట్లుండే ఆ అడవి
పచ్చగా నవ్వుతుంటే ఆ నగవులను అక్షరాలుగా మలుస్తాను.
అక్కడ జోరున వర్షం కురుస్తుంటే కొండకు బదులు నా గుండెను తడిపేస్తూ
ప్రకృతి కవిత్వం రాస్తాను. ఆ శోభను అందమైన పదాలతో బంధిస్తాను.

వనాల సుగంధాలను మోసుకేళ్తూ బస్సు రైల్వే ట్రాక్ వద్ద గేటుపడి ఆగుతుంది.
ఎంత సహనంతో ఎదురుచూసినా ఆ రైలు సమయానికి రాదు.
కంగారుతోనో, నిరుత్సాహంతోనో, ఆలస్యం అవుతుందనో
ఎందుకో తెలియదు ఆగ్రహంతో నా సీట్లో కూర్చోలేక
ఆవేశ కవిత్వం రాస్తాను. అడ్డంకులను అక్షరాలతో తొలగిస్తూ కుదుటపడుతాను.

బస్సు మా ఆఫీసు వైపుగా వెళ్తూ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆగుతుంది.
ఎన్ని అర్జీలు, ఎన్ని రిలే దీక్షలు, ఎన్నెన్ని రాజకీయ రంగులక్కడ.
ఎర్ర జెండాలను మోస్తూ స్థలం కోసం ఒకడు, ఇంటికోసం ఒకడు, పెన్షన్ కోసం ఒకడు..
పోరాటం చేసే సామాన్యులకక్కడ రొజూ లాఠీ చార్జీలే. అడిచుసి బిగిసిన నా పిడికితో
విప్లవ కవిత్వం రాస్తాను. రక్తాన్ని పూసుకున్న కత్తిని నా కాలంగా మలుస్తాను.

అంతలోనే మా ఆఫీస్ వచ్చినట్లు మళ్ళీ కండెక్టర్ విజిల్ మ్రోగిస్తాడు.
ఎందుకో గురువును వీడాలంటే ఎంతో బాధగా ఉంటుంది.
ఆ కిటికీ అద్దాన్ని మూసి తలదువ్వుకొని, నెమ్మదిగా ఆ బస్సునుండి నిష్క్రమిస్తాను.

      
04/10/2013        
     
    


4 comments:

  1. కిటికీలు తలుపులు కూడా గురువులై పాఠాలు నేర్పేస్తుంటే ఎలాగో ఏంటో.....నిజానికి చక్కగా రాసారు, ఏదో సరదాకి అలా అన్నాను అంతే:-)

    ReplyDelete
  2. అబద్ధానికి కూడా ఓ మాట అనేసుంటే పోయేదిగా. థాంక్యూ పద్మ గారు.

    ReplyDelete
  3. ఈ రోజే మీ పెళ్లి చూపుల కెళ్లి ,అక్కడనుంచి విజయనగరం సామాన్యుని ఘోష విని,ఇక్కడకొస్తే,మీకిటికీ పాఠాలు విన్పించారు.అన్నీ సరళంగా,చక్కగా ఉన్నాయి.

    ReplyDelete
    Replies
    1. Bhrahmeswar Rao garu...
      Welcome to my blog. Thank you for reading my posts with patience...

      Delete

Related Posts Plugin for WordPress, Blogger...