కళ్ళు కింద పడ్డాయ్...

నువ్వు తారసపడ్డ ఆ త్రోవలొనే
నా రెండుకళ్ళూ రాలిపడ్డాయి.

నీ అడుగులే తప్ప నువ్వు లేవక్కడ.
ఎంత గాలించినా నువ్వు దొరక్క
నా కన్నులు అక్కడే నిన్ను ధ్యానిస్తూ ఉండిపోయాయి.

ఎన్ని క్షణాలు నీ తలపుల్లో తడిసాయో
భారంతో అస్సలు ముందుకు కదలడంలేదు కాలం.
నీ జ్ఞాపకాల్లో యుగాలు ఆవిరయ్యాయన్న భ్రమలో
ఒక్కసారిగా కళ్ళు తెరుచుకున్నాయి.

నీవు నడిచిన అడుగుల జాడలు అలానే ఉన్నాయి.
నీతో కలిసి నడిచే భాగ్యం లేక
ఆ కళ్ళు కన్నీళ్ళతో నీ ఒక్కో అడుగును
చిన్ని చిన్ని మడుగులుగా మలుస్తూ సాగిపోయాయి.
చివరకు కన్నీళ్ళూ ఇంకిపోయి
కళ్ళు బీటలు బారి భూమిలో కలిసిపోయాయి.

కాలం చేసిన ఇంద్రజాలంలోంచి
ఆనందంతో నువ్వెందుకో మళ్ళీ ఆ త్రోవలోనుంచే వస్తావు.
అక్కడ పడిఉన్న బుల్లి బుల్లి అడుగుల మడుగుల్లో కన్నీటిని
నీ పాదాల చప్పుళ్ళతో అలజడి చేస్తూ వెళ్తావు.

కన్నులకు నిన్ను చూసే భాగ్యం దక్కకున్నా
కన్నీళ్ళు నీ పాదలను స్పృశించే అవకాశం దక్కించుకున్నాయి.
ఈ ఆనందంతో కన్నీళ్ళు ఆనంద భాష్పాలై ఆవిరౌతూ
గాల్లో కలిసిపోతున్నాయి.

ఇంతలోనే ఎవడు పడేసుకున్నాడో మళ్ళీ
ఇంకో రెండు కళ్ళు అక్కడ తచ్చాడుతున్నాయి.

19/10/2013





No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...