ఆడదానికేనా అనుబంధపు సంకెళ్ళు?
అమ్మేనా అలసట ఎరుగని బానిస?
సహనానికి సమానార్థం స్త్రీయేనా?
యుగాలుగా గమనిస్తున్నావ్ అర్థంకాలేదా ?
బిడ్డకు పాలివ్వడానికని, తాపత్రయంతో
కోటగోడల్ని సైతం లెక్కచేయని అమ్మ ఓ ఆడదేగా !
భర్త కోసం యముడితో సైతం
యుద్ధానికి సన్నద్ధమైన భార్య ఓ ఆడదేగా !
దీనులకు ఆపన్న హస్తం అందివ్వడానికి ఖండాలు అడ్డుకావని
నిరూపించిన మాతృస్వరూరాలు ఓ ఆడదేగా !
ఎంతటి ఘనకార్యం సాధించినోడికైనా జన్మనిచ్చేది ఓ ఆడదేగా !
ఇన్ని చేసిన ఆ ఆడదాన్ని కూడ కనేది మళ్ళీ ఓ ఆడదేగా !
అసలు ప్రపంచానికే మూలం ఆడది అయినప్పుడు
ఫలితాలు, ప్రతిఫలాలు ఎందుకు దక్కడంలేదు?
ఆమెకు అవన్నీ అవసరం లేదు.
అసలామె ఆశించదు కూడా.
అయినా కనీస గౌరవం దక్కుతోందా ?
ఆడది దేవతని బయట వాగి
ఇంట్లో, కూరలో ఉప్పు తక్కువైందని ఆడిపోసుకునే
మగాళ్ళు ఉన్నంతకాలం..
గబుక్కున ఉప్పు తెచ్చి తప్పైపోయిందని, ఈ సారికి క్షమించమని
మొగుడు అనబడే మగాణ్ణి బాగుచేయకుండా
ఉప్పు కలిపి కూరను సరిచేసే ఆడాళ్ళు ఉన్నంతకాలం
ఆడది ఆ సంకెళ్ళకు బానిసే.
సహనానికి సమానార్థమే !
మగాడి చేతిలో బొమ్మే !
12/09/2013

No comments:
Post a Comment