నల్ల వెలుతుర్లు



రాత్రి
ఆకాశం ముఖాన్ని
పూర్తిగా చూడకముందే
సూరీడు
చీకట్లను కొద్దికొద్దిగా కడిగేసుకుంటూ
కష్టజీవుల రక్తాన్ని
ఎర్రెర్రగ ప్రతిబింబిస్తూ నిద్రలేస్తున్నప్పుడు
దోసిళ్ళతో
కాసిన్ని చన్నీళ్ళు
మొహాన కుమ్మరించుకుని
వలసపిట్టల్లా ఒద్దిగ్గా ఎగిరిపోతున్న కొందరు
లేవగానే ఆకలి యుద్ధానికి
సన్నద్ధమౌతుంటారు...

వారిక్కావల్సింది
డొక్క నింపుకోవడానికి వొక పని
రెక్కల్లో సత్తువ అరిగిపోయేదాకా
యంత్రాల కుతంత్రాలకు ధీటుగా
పుంజుకొని ఇంకొంచెం చకచకా కదలడానికి
శ్రమజీవుల కష్టాన్ని లెక్కలేయడానికి
చర్నకోల్ లాంటి వొక యజమాని....

ఇప్పుడీ బేరసారాల జీవనయాత్రలో
బ్రతుకు భారం కాకుండా
గుప్పెడు మెతుకులకై వెదుకులాటలో
కుమిలిపోని మదితో
కమిలిపోయిన భుజాలపై
నిర్విరాంగా స్వేదరధాన్ని మోయాలి...
విధి రధచక్రాల్లో నలిగి
రుధిరం స్రవిస్తూ
ఎప్పుడో వొకసారి బలైపోవాలి...

ఇదో నిగూఢ అరాచకత్వం!
ఉన్మత్త అమాయకత్వం!!

1 comment:

  1. ఇప్పుడీ బేరసారాల జీవనయాత్రలో
    బ్రతుకు భారం..బాగుంది

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...