ప్రకృతితో నా వింత పరిణయం



                                                       కవితకు దృశ్య రూపం

 
సెలయేటి కరతాళ ధ్వనులేవో
వింతగా వినిపిస్తున్నాయి.
పచ్చటి వనాల తోరణాలేవో
కొత్తగా కనిపిస్తున్నాయి.
వెచ్చటి వలపు పవనాలేవో
గాఢంగా స్పృశిస్తున్నాయి.

ఆ పలుకులో ఏదో స్తబ్ధత!
ఆ చూపులో ఏదో ఆర్ధ్రత!
ఆ స్పర్శలో ఏదో చేయూత!

పంచేంద్రియాలకు అందని భావాలేవో
నా మనసుని ముసిరేస్తున్నాయి.
పంచభూతాలు పసిగట్టని ప్రశాంతతలేవో
నా చుట్టూ ఆవరిస్తున్నాయి.

వింతలకు నెలవైన విశ్వమంతా
నన్నే గమనిస్తున్నట్టుంది.
క్రొత్తదనానికి కొలువైన వింత
లోకంలో నేనున్నట్టుంది.

చుట్టూరా ఏదో హడావిడి!
మనసులో మాత్రం అలజడి!

పావురాళ్ళ వర్తమానాలు,
చిలకమ్మల పెద్దరికాలూ;
తేల్చేసాయి నా సందేహాలు.
కలిపేసాయి తమతో సంబంధాలు.
నా భ్రహ్మచర్య భగ్నానికి,
ప్రకృతితో నా లగ్నానికీ
చూసేసాయి ముహూర్తాలు.

వెదురు వనాలు వాయిస్తున్నాయి!
వేవేల మేళకర్త రాగాలెన్నో.
వంతపాడి స్వరాలు కలిపేస్తున్నాయి!
విరిసిన కోయిలమ్మల గొంతులెన్నెన్నో.

నోరూరి ఉసిరి తిని తరించిన జిహ్వ
నీటిలో కొత్త రుచినేదో సంతరించుకున్నట్లు
విశ్వమంతా ఈ వైవిధ్య గీతాలాపనలో
కొంగ్రొత్త భావాలతో మురిసిపోతోంది.

ఆనందంతో గంతులేస్తున్న నీలిమేఘాలు
ఊరుముల ఔట్లను పేలుస్తున్నాయి.
మెగావాట్ల విధ్యుత్ ఫ్లాషులతో మెరుపులు
ఒక్కో క్షణాన్నీ అపురూపంగా బంధించేస్తున్నాయి.

అచ్చరువొందిన తారాసమూహాలు
ఆనందపు చిరునవ్వులతో తళుక్కుమంటున్నాయి.
తనువు పులకరించిన వినీలాకాశం
విరిజల్లుల అక్షింతలు కురిపిస్తోంది.

ప్రేయసిగా నేనారాధించిన ప్రకృతి
తనంతట తానుగా నాతో పరిణయానికి సిద్ధమై
నా ప్రేమ శాశ్వతమని ఋజువు చేస్తున్న
ఈ శుభసంధర్భాన మీ ఆశీర్వాదాలనూ ఆశిస్తూ...

... . ..
మీ వినోద్

                                                  02/08/2013



2 comments:

  1. ఏంటో ఈ వింత పరిణామం.....ఇలా వీడియోలో కూడా ప్రకృతి అందాలని చూపిస్తున్నారు :-)

    ReplyDelete
    Replies
    1. ఎవరూ ముందుకు రానప్పుడు ఎదో దిక్కులేని పరిస్తితులలో ఇలా... తాంక్యు పద్మ గారు

      Delete

Related Posts Plugin for WordPress, Blogger...