దోమలూ జోల పాటలు పాడుతాయ్...
కానీ, కాస్త కర్ణకటోరంగా!
‘గుయ్య్..’ మంటూ ఎన్నో భావాలు పంచుకుంటాయ్...
మనకేమాత్రం అర్థం కావుగా !
ఎన్నో పరాన్నజీవులకు ఇవి టిక్కెట్టు అడగని రక్త విమానాలు...
రోగాలు రవాణా చేస్తూ,
భోగాలు అనుభవించే స్వేచ్చా సమూహాలు...
శోకాలు మిగిలిస్తూ చక్కర్లుకొట్టే చలాకీ స్మగ్లర్లు...
మగదోమలు పాపం! మన రక్తం పీల్చని సోమర్లు...
అమ్మో! ఆడదోమలు;
శూలాలు తొండంలో దాచుకున్న రాక్షస జలగలు...
వినాయకుడి చేతి పళ్ళెంలో లడ్లలా,
చితిని చుట్టేసిన బుల్లెట్లలా,
సూక్ష్మ హిమాలయాల్ని తలపించే వీటి గుడ్లు...
సముద్రంలో సర్పకన్యలు విహరిస్తున్నట్లు,
నీరు ఎక్కడ నిలువ ఉన్నా నాట్యమాడే వాటి లార్వాలు...
అబ్బో! ఇంకా ఎంతచెప్పినా అది చాలా తక్కువేలే!
మనుషులంటే మాత్రం వీటికి తరగని మక్కువేలే!!
25/08/2013
ఆడదోమల్ని ఆడిపోసుకుంటూ అమ్మోయ్ దోమలు అంటారా :-)
ReplyDeleteపద్మా జీ :: ఉన్నమాటంటే ఉలిక్కి పడతున్నారెందుకో.. ..
Delete