కవితా మాత్రికలు 3x3 [1-5]



ఈ మధ్య కవితా మాత్రికలని ఓ కొత్త రచనా ప్రక్రియను మొదలుపెట్టాను.
ఎన్ని వరుసలు రాస్తామో, వరుసకు అన్ని పదాలు రాసుకుంటూ పోవడమే. కాకపొతే నేను 3x3 మాత్రిక రూపంలో మొదలెడుతున్నాను.
పైత్యం ముదిరి పాకాన పడింది. అందుకే ఇలా ......
1.
ఎవడు పోగొట్టుకున్న హృదయమో
చీకట్లను కొల్లగొట్టిన ఉదయమై

వెలుగుల్ని వెతుక్కుంటోంది వినోదానందా!

2.
వాడు ప్రపంచాన్ని తాగి,
జీవితాల్ని భోంచేసిన ప్రకృతిలా;

ప్రేమను విసర్జిస్తున్నాడు వినోదానందా !


3.
ఆకాశం ఆదమరచి నిదరోతూ

ఉరుముల గురక పెడుతోంది

నక్షత్రాల్ని మేల్కొలపాలని వినోదానందా !


4.

మసిబారిన లాతరు చిమ్నీ

వెలుగును తినేస్తోంది కొద్దికొద్దిగా

నెత్తినెక్కిన అహంలా వినోదానందా !


5.

సముద్రాల్ని ఎత్తుకెళ్తే మేఘాలు;

చేపల కన్నీళ్ళు సృష్టిస్తాయి -

ఇంకో సముద్రాన్ని వినోదానందా !

2 comments:

  1. వినోదానందమే మా ఆనందం....:-) ఏ మాటకామాటే బ్రహ్మాండంగా ఉన్నాయి కొనసాగించండి.

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...