మోసగత్తె....


సాటర్డే నైట్ ఫీవర్తో సంతోషంగా లగెత్తుకొస్తే
శనివారం శోభనమేంట్రా మెంటలోడా అని
రెండు గోలీలిచ్చి గురకపెట్టి బజ్జోమన్నావు...

గాలివానలకు గువ్వలా తిరిగి గూడు చేరితే
అలసిపోయావంటూ మాయమాటలు చెప్పి
గప్ చుప్ గా గుండె గదికి గొళ్ళెమేశావు...

చలేస్తోందని చెంత చేరి చీరలో దాక్కోబోతే
పాజిటివ్ లక్షణాలు మొదలయ్యాయంటూ
వేడిగా కరోనా కాషాయం తాగమన్నావు...

ప్రేమతో పట్టెమంచమేసి పక్కకు రమ్మంటే
ముట్టయ్యాను ఇప్పుడు ముట్టుకోకకంటూ
సావుకబురు సల్లగా చెప్పి తప్పించుకున్నావు...

మాటవినక మోజు తీర్చుకుందామనుకుంటే
మొండి మోహమోడా అంటూ పక్కకునెట్టి
మోసగత్తెకి నిలువెత్తు సాక్షంగా నిలిచావు...

దీక్ష


నువ్వు నాతోలేక
యుగాలు గడిచిపోయాయి...
మనం కన్న స్వప్నాలూ చెదిరిపోయాయి...
పగళ్లను కమ్మేస్తున్న చికటిపొరలతో
మన ప్రపంచం వెలుగుని కోల్పోయినట్టుంది...
అప్పుడొకసారి
దోసిట్లో తీసుకున్న నీ మొహం
ఇప్పుడు కన్నీరై వొలికిపోతోంది...
తడిబారిన జ్ఞాపకాల గుండెలోంచి
ఉబికొచ్చే రుధిరాహ్ని
నన్ను భగభగా కాల్చేస్తోంది...
నా దేహమంతా
ప్రజ్వలించే భావోద్వేగాలతో
ఇప్పుడు నీ దీక్ష చేయడమే నాకు మిగిలింది...


ఉప ఉత్పత్తి!


నేను సూర్యుణ్ణి
హృదయమంతా పరచుకున్న ఈ రాత్రి చీకట్లో
నా భావోద్వేగాలు చిందరవందరయ్యాయి

గింజుకుంటున్న ఆకుల మధ్య
చిక్కుకున్న వెన్నెల కాంతుల్లో....
విరహం వలపుల్ని ఒక కవాటంలో
అహం అనుమానాన్ని ఇంకో కవాటంలో పేర్చి
జ్ఞాపకాలతో విలవిలలాడే మనసుకి
శస్త్రచికిత్స చేసుకున్నాను....

ఓపిగ్గా కుట్లు వేసుకున్నాక
ఆకులమధ్య చిక్కుకున్న వెన్నెలను విడిపిస్తే
చిందరవందరయిన తన భావోద్వేగాలతో
పగటి వెలుతురు కోసం
వెదుక్కుంటూ వెళ్ళిపోయింది
తన శస్త్రచికిత్స కోసం
పగలు నేను మేఘాల్లో చిక్కుకుపోయాను...

రాత్రీ పగళ్లు వంతులేసుకొని మేము కాపాడుకునేది అపురూపమైన ప్రేమను!
ఈ ప్రపంచ గమనం మాత్రం
బహుశా మా ప్రయాణంలో ఉపఉత్పత్తి అయుండొచ్చు!!

చిక్కుముడి!


నీ దేహంపై రెండు చందమామల మధ్య
నేనో చందమామనై తిరగాడిన క్షణాలు
నాకింకా గుర్తు...

వెన్నెల కురిపించే మన ఏకాంతాన్ని
ఏ కాలమంటారోనని కాలమే పసిగట్టలేక పారిపోతే
నవ్వి నవ్వి నా గొంతులో తడిఆరిపోయేది...

మళ్లీ మళ్లీ గుర్తొచ్చే
నీ చిలిపిచుంబన రహస్యాల జాతరలో
నన్ను ఎన్నోసార్లు తప్పిపోయేలా చేసి,
వలపు వెదుకులాటలో మళ్లీ కనపడితే
నుదుటిపై ముద్దుల హా'రతి పట్టి నన్ను హత్తుకునేదానివి చుడూ....
అదెంత మధురమో కదా!

మన సరససరాగసమరోత్సాహసమయంలో
తొంగిచూస్తే కిటికీ ఆవల కనపడే కదంబకదనోత్సవానికి మనమెంత ప్రేరణనిచ్చామోనని గర్వపడేవాళ్ళం కదా...

పొగు'పడ్డ ఆ జ్ఞాపకాల చిక్కుముడి విప్పడం నాకిష్టంలేదు...
అందుకే చిక్కులో చిక్కుకుపోయిన నిన్నూ నన్నూ అలానే గుర్తుంచుకుంటా...

నా ప్రేమ!

ప్రేమంటే మానసిక బంధమని
భ్రమలో భ్రమరమై తిరిగాను..

ప్రేమంటే భౌతిక సమక్షమని
సహేతుక సాక్ష్యమై నిలిచావు..

నీకోసం నేను చేసిన పనులచిట్టా అడిగితే
నిన్నేమని సమాధానపరచను?

నా మనసు ఖర్చుచేసిన గతాన్ని
ఘడియల తరబడి గుర్తుకు తెప్పించనా?

కరిగిన కాలపు కన్నీటిచుక్కల్ని పేర్చి
నీ అందమైన దోసిట్లో సముద్రాన్ని ఒంపనా?

నా ప్రేమలో నిస్వార్థాన్ని నిర్వచించమని సవాలువిసిరితే
నా మరణ లేఖను నీ మనసు చిరునామకు పంపనా???

బహువచనం!


జీవితానికి బహువచనం ఎరుగని నేను
ప్రతి రెప్పపాటులో  లెఖ్ఖలేనన్ని జనన మరణాలను
ఇప్పుడు అనంతంగా రాశి పోసుకుంటున్నాను...

నలుపూతెలుపుల రాత్రీ పగళ్ల లేపనంతో
గుండెపగుళ్లను అమాయకంగా పూడ్చుకొన్న నేను
ఇప్పుడు కొన్ని రంగుల్ని కళ్ళలో ఇముడ్చుకుంటున్నాను...

గొంతుకకే దాహం ఉందని భ్రమించిన నేను
ఇప్పుడు అసలైన తృష్ణ తీర్చుకోవడానికి
కొన్ని ఆశలను మూటకట్టుకుసాగుతున్నాను...

చీకటి ప్రపంచంలో గురిలేని మిణుగురైన నేను
ఇప్పుడువెలుగుల దారుల్ని వెదుక్కుంటూ
కొన్ని నిప్పురవ్వల్ని మెదళ్ళో దాచుకుంటున్నాను...

17.07.2019 :: Wednesday :: @Sanipaya
*నన్ను కదిలించిన ప్రేరణకు.. ప్రణమిల్లుతూ... 

వి'చిత్ర రాజీ'వం! | కథానిక

My Second Story :
(సహానుభూతికి లోనై రాసుకున్న కథానిక)

'అయ్యో!
ఆయామ్ సో సారీ వే రాజీ మర్చిపోయా...
రేపు తప్పకుండా వస్తాగా.'

'నీ మొహం సారీ..
రేపే వెళదాంలే...
అయినా మించిపోయింది ఏం ఉంది?
లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వడానికి ఇంకా నెల టైం ఉంది కదా?'

'ఇదేం విచిత్రమో...
మనం బ్రతికున్నామని ఎవడో సర్టిఫై చేస్తే గానీ పెన్షన్ రాని బ్రతుకులా మనవి?'

' అబ్బా... ఈ రూల్స్ గురించి తెలిసిందే కదా!!
ఇన్నేళ్లు గవర్నమెంట్ జాబ్ వెలగబెట్టాం..
ఆమాత్రం సహనం ఉండొద్దా ఏంటి?
సరేగానీ చిత్రా, ఏంటే విశేషాలు?
అంత అర్జెంట్ పని ఏంటో ఇవాళ...'

'అదేం లేదే...
షాపింగ్ కి వెళ్తున్నా. కొన్ని బుక్స్ కొనుక్కోవాలి. నెక్స్ట్ వీక్లో మా నాని గాడి బర్త్డే.  ప్రతి సంవత్సరం ఒక బుక్ ప్రెసెంట్ చేస్తాను. నీకు తెలుసు కదవే.
ఈ మధ్య నాకూ పొద్దుపోవడంలేదు.
మన ట్రెండుకు తగిన పాత పుస్తకాలు దొరుకుతాయేమోనని కోటి సండే మార్కెట్ కి వెళ్తున్నా..'

'వామ్మో... నీకు పుస్తకాలు చదివే ఓపిక కూడానా? నాకైతే ఈ గని గాడు ఊపిరి ఆడనివ్వడంలేదు. అదేవే మా రెండో అమ్మాయి పిల్లాడు.
ఇంతకీ ఎప్పుడొస్తాడు మీ నాని?
పెళ్లి అయినప్పటినుంచి పత్తా లేకుండా పోయాడు? వెదవఖానా'

'అదేం లేదు వే....
వాడూ బిజీలో ఉన్నాడు! ఇప్పుడే కదా ప్రపంచాన్ని ఈదడం స్టార్ట్ చేసాడు.
ఢిల్లీలో ఫ్లాట్ కొంటున్నాడు.
అక్కడే సెటిల్ అవుతున్నాడు'

'అదేంటే?
మరి నువ్వొక్కదానివే ఇక్కడ ఎలా?
సంవత్సరం తర్వాత ఇక్కడే ఏదో కంపెనీలో జాబ్ చూస్కుంటా అన్నాడాని చెప్పావు...
కోడలు కూడా సాఫ్ట్ వేరే కదే?
హైదరాబాదులో లేని ఉద్యోగాలా??
సంపాదించలేని జీతాలా??'

'ఎమోలే! రాజీ...
నాకు ఈ సాఫ్ట్ వేర్ ఉద్యోగాల గురించి తెలీదు.
వాడికి మాత్రం ఇక్కడ ఉండాలని ఉండదా ఏంటి?
అంతకు కాకపోతే నేనే అక్కడ ఉండిపోతా...
ఎప్పుడూ పిలుస్తూనే ఉంటాడు పాపం.
నేనే వెళ్లడం లేదు.'

'నాకొక డౌటు..
ఎప్పుడూ పుస్తకమే గిఫ్ట్ గా ఇస్తావు.
ఎందుకో? తెలుసుకోవచ్చా మేడం?'

'అదేం లేదు వే. ఏదో నా జ్ఞాపకంగా అంతే!
నేను వాడితో లేకపోయినా వాడు ఈ పుస్తకాల్లో... ఇందులో తెలుసుకునే నాలెడ్జ్ లో అయినా నన్ను చూసుకుంటాడని. అమ్మగా ఆప్యాయతతో చేసిన సంతకంతో ఉన్న బుక్స్ వాడి జీవితానికి ఏదొరకంగా ఉపయోగపడతాయేమో అని అంతే!
ఇంకేం ఇవ్వగలను వాడికి?
వాళ్ల నాన్న పోయినప్పటినుంచీ వాణ్ణీ ఈ స్థాయికి తీసుకు రావడానికే నా జీవితం అంతా అయిపోయింది'

'డోంట్ గో మాడ్ బేబీ!
నా మూడ్ మార్చమాకు.
సెంటిమెంట్లు పక్కన బెట్టి, ముందు షాపింగ్ కి వెళ్లమ్మా.... బుజ్జి...
జాగ్రత్త! అసలే ట్రాఫిక్ ఎక్కువ ఈ టైంలో...'

అంటూ ఫోన్ పెట్టేసింది రాజీ. ఫోన్లో స్క్రీన్ సేవర్ గా మనవడు 'గని' ఫోటో చూస్తూ ఏడుస్తోంది.

ఆరోజు గని రెండో పుట్టినరోజు. ఇంట్లో అందరూ ఫంక్షన్ హాల్ కి వెళ్లారు. రాజీ మాత్రం కొడలితో మనస్పర్థల వల్ల వెళ్ళలేదు. కొడుకు కూడా పెద్దగా బలవంతపెట్టలేదు రమ్మని.

* * *

మనసులో ఏవో ఆలోచనలు, అంతర్మధనంతో ఆక్టివా తీసి కోటీ బయలుదేరింది చిత్ర.

ఏంటి నా బ్రతుకు?
ఎందుకు ఇలా ఏకాకిలా ఉన్నాను?
దీనిబదులు చావడం మేలు..
అసలు బ్రతికి ఇంకేం ఉద్ధరించాలి?
నేనెందుకు బ్రతకాలి అసలు???

ఆ రాజీ చూడు.. ఎంత హ్యాపీగా ఉందో...పిల్లా జల్లా మనవళ్లతో....
ఏ పాపం చేసుంటానో నేను?
నిజమే! ఏదో చేసే ఉంటాను.
లేకపోతే ఈ ఖర్మ ఎందుకు నాకు?
అయినా నానీ కోసం ఏడవడం తప్పా?
కన్న కొడుకును తేరిపారా చూడాలి అనుకోవడం కూడా తప్పేనా??
ఏమో... నాదే తప్పు అనుకుంటాను.
అవును... నాదే తప్పు.#%^##!!?!
అసలు ఎవరిమీదా ఆశలు పెట్టుకోకుండా ఒక్కదాన్నే బ్రతకాలి.
హుందాగా... దర్జాగా... బ్రతికి చూపించాలి. 
బ్రతికి ఎవరికి చూపించాలి?
చూపించి ఏం సాధించాలి?
నా నానీ కోసం... బ్రతకాలి...
అయినా ఎందుకో..
నా నానీ కోసం ప్రాణం పీకుతోంది.
వాడు సంవత్సరం లో ఒక్కసారి కూడా రాలేదు.
ఏమో.. వాడికి ఎన్ని కష్టాలున్నాయో?!
పాపం వాడు... అమ్మను వదిలి దూరంగా ఎలా ఉన్నాడో ఎంటో..
ఒట్టి అమాయకుడు.
ఎలాగూ వారం రోజుల్లో నేనే వెళుతున్నా కదా సర్ప్రైజ్ గా...

హమ్మయ్య... కోటీ వచ్చేసింది....
ఫుట్పాతులన్నీ పుస్తకాల పరిమళాలతో అలంకరించబడి ఉన్నాయి.
నేనే ఏ పరిమళం లేకుండా మడిచి పడేసిన పేపర్ ఉండలాగా ఉన్నాను...

ఫుట్పాత్ వెనుక ఉన్న పబ్లిషింగ్ హౌస్ లోకివెళ్లింది చిత్ర.

***

'రండి మేడం.. ఎలా ఉన్నారు? మీరు చెప్పిన బుక్ తెప్పించామండి. ఎంతో కష్టపడితే కానీ దొరకలేదండీ నమ్ముతారో లేదో '

'చాలా థ్యాంక్స్ అండి. దీనికి రివ్యూస్ బావున్నాయి అంట కదా? ఆన్లైన్లో కూడా దొరకడం లేదంట కదా. మా ఫ్రెండ్స్ చాలా మంది ట్రై చేశారు'

' మరి 'పాలో కోయిలో అంటే మాటలా?  ప్రపంచంలో హాట్ కేకుల్లా అమ్ముడుబోతున్న పుస్తకం అది. కానీ మీకోకటి చెప్పనా? మన తెలుగు రచయిత 'త్రిపురనేని గోపిచంద్' సేమ్ టు సేమ్ ఇదే థీమ్ తో ఎప్పుడో 60 ఏళ్ల ముందే రాశాడండి ఇలాంటి బుక్. ఇదిగో ఇది కూడా చూడండి'

'ఓహ్... అవునా. ఎంతైనా మనోళ్లు చాలా అడ్వాన్స్ గా ఉన్నారే. థాంక్స్ అండి. ఇంక బయలుదేరతాను'

'నమస్తే మేడం'

***

అప్పట్లో చిత్ర పుస్తకాల పురుగు. పుస్తకాలే ఆమె ఒంటరి జీవితాన్ని నడిపించాయి. ఎన్నో కష్టనష్టాలను ఓర్చి ఈ స్థాయికి రావడానికి పరోక్షంగా ఈ అక్షరాలే కారణం. ప్రపంచాన్ని, దాని పార్శ్వాలను తన జీవితంలో దగ్గరగా అనుభవించింది. జీవితానుభవంలో పుస్తకాలు నేర్పించిన అక్షర జ్ఞానమే చిత్రను ఇంకా నడిపిస్తూనే ఉంది.

చిత్ర అలా ఫుట్పాత్ పై ఉన్న పుస్తకాలు చూస్తూ నడుస్తూఉంది. సడెన్ గా ఒక పుస్తకం చిత్రని జ్ఞాపకాల వలయంలో బంధించింది. వెంటనే దాన్ని అందుకొని పేపర్ తిప్పింది. ఒక్క క్షణం చిత్ర నిర్ఘాంతపోయింది. మొహంలో చుక్క నీరులేదు. పుస్తకం జారి పడిపోయింది. ఆమె మాత్రం ఇంకా పడిపోలేదు.

ఆ పుస్తకం మొదటి పేజీలో ఉన్న సంతకం తనదే! రెండేళ్ల క్రితం నాని బర్త్ డే కి గిఫ్ట్ గా ఇచ్చిన బుక్ బుచ్చిబాబు రాసిన - చివరకు మిగిలేది.....

హృదయద్రవం!!

నాలో యే మనిషి
రాగంగా ధ్వనిస్తున్నాడో
నాలో యే ఋషి
మోనంగా ధ్యానిస్తున్నాడో
తెలుసుకుందామనీ కలుసుకుందామనీ...
సంశయం వద్దనుకుంటూ
మస్తిష్కపు తలుపులు బద్దలుకొడితే
చప్పున ఎగసిపడే మదినిప్పుల ఉప్పెనతో
కాగే ఈ దేహమంతా ఛిద్రమైన గాయాల్లోంచి
కారే హృదయ ద్రవంతో భద్రంగానే ఉందనిపిస్తోంది...
మార్కెట్టు ప్రపంచపు బడబాగ్నిలో
తట్టుకోవాలంటే.. గిట్టుబాటుకావాలంటే...
ఈ సందేహ దేహాన్నీ... దానిలో ప్రవహించే
ఈ కరుకుదనపు హృదయద్రవాన్నీ...
కనిపించే మరమనిషిగా
కనిపించని తెరచాటు ఋషిగా
మండించి మరిగిస్తూనే ఉండాలి...
కనీసం మరణించేదాకైనా!

ప్రాపంచికం!!


ఎందుకో ఈ ప్రపంచం
నీది నాదీ కాదనిపిస్తోంది...
నాల్కలపై కొన్ని రంగులు అద్దుకొని
పెద్ద పెద్ద ప్రవచనాలతో గద్దించే
రంగురంగుల మనుషుల అద్దెకుటీరమనిపిస్తోంది...
రక్తాన్ని..చెమటనీ..మెదళ్లనీ ఓపిగ్గా ఒంపి
బ్రతుకునిచ్చిన నేల దాహాన్ని తీరుస్తున్న
అసలైన యజమానుల స్మశానవాటికనిపిస్తోంది...
ఎందుకో ఈ ప్రపంచం
పొడిబారిన ఏడారుల్లో
అందంగా కనిపించే త్రాచుపాముల గుట్టలా...
మందుపెట్టి ఆకట్టుకునేలా పేర్చబడ్డ
పచ్చి మావిడిపళ్ల బుట్టలా...
ఎప్పుడు తెగిపోతుందో తెలియని
ఆహ్లాదకరమైన నిండు చెరువు గట్టులా...
అప్పుడే చీకటిని దాటుకుని వెలుగులోకి వచ్చిన
నీ నా కళ్ళకి చాలా నచ్చేట్లు కనిపిస్తోంది...
నిజానికి ఈ ప్రపంచం
నిన్నూ నన్నూ రంజింపజేయడానికి
ఎంతో కష్టపడుతూ అందమైన వినాశనానికి
ఆతృతతో దారులు పరుస్తోందో
ఒక్కసారి తనివితీరా చూడవూ....

ప్రణయస్థలి...


నీ మెడవొంపుల్లో దాచుకున్న
నా ముఖాన్ని తమకంతో చూడలేక
నుదుటిపైనుంచి జారిపడ్డ శ్రమ బిందువులని
పెదాలతో ప్రేమగా మాయం చేశాక....
సరస సతతహరితారణ్యంలో
మధుర జ్ఞాపకాల పొదల్లో వికసించిన
మన గరికపచ్చ ప్రేమని కిటికీ అద్దంలోంచి తొంగిచూసి
ఒక పిట్ట రోజూ ఎత్తుకెళ్లి గూడు కట్టుకున్నాక....
శ్రమైక జీవన సౌందర్యం అంటూ
దేహపు ఆకాశాన్ని తవ్వి సముద్రంలో పారబోయించి
నీరంతా ఇంకిపోయి పొడిబారిన పెదాలకు
రవంత ఎంగిలి తుంపర్లతో తడిపి
చిందరవందరగా చెరిగిన జట్టులో
నీ మునివేళ్ళను నాగళ్లుగా విసిరి సేదతీర్చాక...
యెద వ్యధను కన్నీళ్ళలో దాస్తూ
మమకారాన్ని చిరునవ్వుతో మోస్తూ
మురిపెంగా నీ ఎదపై వాలనిస్తావు...
అర్థంకాని జీవితపు పరిమళాన్ని
వొక్క వుదుటున పరిచయం చేసి
అసంకల్పితంగా రణస్థలం నుంచి వెళ్లిపోతావు చూడూ...
నీది యే యుద్దనీతి???
ఇంతకీ నేను ఓడినట్లా? గెలిచినట్లా??
Related Posts Plugin for WordPress, Blogger...