విన్యాసం...


పగలూ రాత్రీ
స్పృహలో నిస్పృహలో
తెలియని బాధేదో తేలికగా అంటుకున్నట్టు
ఏదో నా చుట్టూ నన్ను కమ్ముకుంటోంది
ఏదో నానుంచి నన్ను దూరం చేస్తోంది
ఏమిటిది?
జీవితపు విషాదమా?
నిషా ఎక్కించే బ్రతుకు విషమా?
నీరై కారిపోతున్నాను...
నిప్ఫై కాలిపోతున్నాను...
గాలై ఎగిరిపోతున్నాను...
అంతా సంశయం... సందేహం...
చేదు ఎరుగని దేహానికి
చావుకన్నా చచ్చేంత పిరికితనం
నొప్పి తెలియని హృదయానికి
వ్యసనమే వ్యాపకమైన వైనం
ఎందుకీ కుదుపు? ఏమిటీ కనుపు?
విశ్వాన్ని కదుపుతుందా?
విధ్వంసానికి పురుడుపోస్తుందా?
పద పరిగెత్తు...ఆగకుండా..అలియకుండా...
విశ్వవ్యాప్తం అయిన దీన్నుంచి
దూరంగా ఇంకా దూరంగా...
అవును..దీన్నుంచే!? ..ఇదేదో తెలియదు ..
అయినా దీన్నుంచే...
బాధో.. బంధనమో....
రోగమో..రాగమో..
మోహమో...మైకమో...
దీన్నుంచే.. సరిగ్గా దీన్నుంచే...
నెమ్మదిగా.. వేగంగా .. ఇంకా వేగంగా..
అన్నీ వదిలేసి పరిగెత్తు
ఏదీ నీదికాదని పారిపో...
ఎక్కడికి?? ఏమో....
గమ్యం లేని రహదారో
గుమ్మం లేని ప్రవేశమో
గాలి దూరని గ్రహమో
ఏదో ఒకటి నాకోసం ఉండకపోదా??
ఎక్కడో ఓ మూల సుఖం దొరక్కపోదా??
అక్కడిదాకా పరిగెత్తకపోనా???
ఈ జీవితాన్ని వదిలి సుఖాన్ని పొందకపోనా??
అవును ..సుఖమే...నాక్కావాలసిన సుఖం!?!?
కానీ!#!... కానీ!#%... సుఖం అంటే ఏమిటి?
నాకు ఏం కావాలి?? ఎందుకు పరిగెత్తాలి??
ఏమిటా సుఖం?? ఎక్కడుంది??
దొరికితే నిజంగా అది సుఖమేనా??
సుఖం నన్ను కావలించుకుంటుందా??
అబద్ధం! అంతా పచ్చి అబద్ధం..
మరి ఏది నిజం?? ఎక్కడుంది??
దాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలి
అవును దాని పొందుకు పరిగెత్తాలి..
లెగాలి ఇప్పుడు...తకక్షణమే..
క్షణం ఆలస్యం అవ్వకూడదు..
లే...లే..లే...
లేచి మొహం కడుక్కో...
కాదు... కాదు...
కడుక్కోవాల్సింది మొహం కాదు...
ఇంకేది?? నాకు పిచ్చెక్కుతోంది...
అవును పిచ్చి... ఏం కడుక్కోవాలి??
అవును! ఏదో కడుక్కోవాలి...విదుల్చుకోవాలి ..
అద్దంలా మారాలి... అంతా ప్రతిబింబించాలి...
అదే అదే.. ఏది...
హా... మనసు...అవును మనసు...
అవును మనసు మకిలీ కడుక్కోవాలి..నిజం!
అదే నిజం...
కాదా??? అవునా??
అవునూ...కాదూ...కాదూ...అవునూ..
ఎందుకు? ఎందుకు??
ఏమైంది నాకు??
కాదు కాదు... ఏమైందీ లోకానికి??
నాలా లోకమ్ కూడా ఒంటరీదా?
అయితే బావుణ్ణు..
ఇద్దరం జత కట్టొచ్చు.. !!
ఇద్దరి బాధా ఒక్కటే...ఒక్కటే!!!
ఇదే నిజం!!




No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...