యాన్ ఎరిత్రియన్ రైజ్



ఎర్రబడ్డ చేతుల్తో
మెతుకు ముట్టని రాత్రుల్లో
నీ కంట్లోని ఆక్రోశం...

ఒళ్ళు హూనమయ్యి
మంచానపడ్డ రోజుల్లో
నీ పిడికిల్లోని ఆవేశం...

బద్దలైన నీ ఆత్మగౌరవంతో
ఇంకొకడికి బద్ధుడివైన అప్పటి నీవు
ఇప్పుడిక నీవు కానే కావు...

శ్రమదోపిళ్ళలో బలిపశువై
దోసిళ్ళలో కాసులకు బదులు
రుధిరాశృవుల్ని చవిచూసి
కాలిన కడుపుతో కదంతొక్కిన
ఒకప్పటి పీడిత కాందిశీకుడా...

నరాల్లో తరాలుగా నింపబడ్డ
బానిసత్వపు గరళాన్ని
తరంగాలుగా ఎగజిమ్ము!

నెర్రలుచీలిన బ్రతుకుభూముల్లో
వలసలై పారిన దోపిడీ మలినాల్ని
విప్లవకెరటమై పారద్రోలు!

రెక్కల్నీ..రక్తాన్నీ..
అమాయకంగా ధారబోసి
అరువుగా తెచ్చుకున్న
దారిద్ర్యపు దాస్యసంకెళ్ళని
నీ కంఠధ్వని పదునుతో విడనాడు!

శ్రామికుల కష్టాన్నిజెప్పి
కాసుల సంచులుదెచ్చి
జిత్తుల నక్కలా జుర్రేసి
దీనుల పక్షాన కుత్తుకైనా కదపని
చెత్త నాయకుల చర్మం వొలుచు!

దగాపడ్డ దీనుడా...ధీరుడవై ప్రశ్నించు!
ఎరుపెక్కిన కాంతికిరణమై ప్రసరించు!!
ఎదురులేని విప్లవనదిలా ప్రవహించు!!!


1 comment:

  1. ఇలాంటివి కూడా రాస్తే మాలాంటి వారికి అర్థం కావు

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...