సుహృల్లేఖ



తుషారకలశాన్ని మనస్సులో నింపుకొని
మేఘాల మాటునదాగిన మోహాన్ని చుట్టుకొని
నక్షత్రాల వెలుగుల్తో వదనాన్ని అలంకరించుకుని
నీ పలకరింపులతో రాత్రుల్ని వధిస్తూ స్వప్నకౌముదినొకటి
నా హృదయ హరివాణంలో విసిరెస్తావు చూడూ...
అప్పుడు నిద్రొస్తుంది నాకు!
కలల్లో...కన్నీటి కాఠిన్యాన్ని దాస్తూ ప్రవహించే నీ నవ్వుల
అలల్లో...నాకూ ఓభాగముందనుకొని
ఒక సంతృప్తానుభూతికి లోనౌతూ
నా రెప్పల ద్వారాన్ని మూసి
నీకై రెక్కల స్వప్నాల్లో విహరిస్తాను...

అగాథంలో ఉన్న నీ మనస్సు
అంతుచిక్కనిది అంటే నేనొప్పుకోను...
ఎందుకంటే నేను అగ్నిపర్వతాన్ని
అగాధంలోనే ఎక్కువ బద్ధలౌతుంటాను...
గుబురుపొదలంటి ఎద ద్వీపాల సముదాయాల్నో
ఆలోచనల్తో దహించబడ్డ ద్వీపకల్పాల తీరాల్నో అప్పుడప్పుడు స్పృశిస్తుంటాను...

నువ్వు అగాధాన్ని నింపుకొన్న నీరువు
నేను అగధాల్లో బద్ధలయ్యే అగ్నిశిఖని
సాన్నిహిత్యానికి పొంతన అవసరమని
అందర్లా వంతపాడ్డం నాకు నచ్చదు..
వంతులేసుకొని పలకరిస్తూ
కృత్రిమనవ్వుల్ని చిలకరించడం నీకు నచ్చదు...

ఇద్దరం సమవుజ్జీలమే...
హృదయసమతౌల్యతాసముపార్జులమే...
రా...కన్నీటి చారల్లో నవ్వుల సలిలాన్ని నింపి
తుషార కలశాన్ని ప్రపంచానికి అడ్డుగా వొంపి
భవబాంధవ్యాల నూతనాధ్యాయాన్ని లిఖిద్దాం!!

5 comments:

  1. వినోద్...ఇది మీ అక్షర పఠిమా కౌసల్యానికి మచ్చుతునక. సూపర్బ్.Excellent pic. Keep writing

    ReplyDelete
  2. Well created blog.
    Excellent pic and lines.

    ReplyDelete
  3. తన్మయ పరిచే భావం బాగుంది

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...