స్వాప్నిక జగత్తులో
నీ రూపమెరుగని నా కళ్ళకు సవ్వళ్ళుచేస్తూ
సామీప్యమైన మగువనే ఓ మత్తుసంద్రమా!
విధి చేసిన అలజడుల్లో
నలిగిపోయిన గతాన్ని మోస్తూ
అర్ద్రంగా అలసిన నా మదిని
నీ ముందు ఆవిష్కరించాలని...
నా యెదపొందిన అందమైన అనుభూతుల్ని
నీ సాంగత్యంలో వర్షింపజేయాలని...
ఎన్నెన్ని కునుకుపాట్లు ....ఎన్నెన్ని చిగురుటాశలు...
చంచలమైన యీ చిరు హృదయానికి...
పురుషులంటే గిట్టని నీ హృదయ పరిధిలో
సరసమైన మాటలతో నన్నెందుకాహ్వానించావ్?
తేనె పలుకులన్నీ పంచేసి
కర్కశత్వాన్ని మిగుల్చుకున్నావేమో కదా?
మన మనసులాడిన సయ్యాటలో సరిజోడివో
తపన పడ్డ యెదఘోషలో నైరాశ్యానివో
అనుభవంతో నే రాసుకుంటున్న బ్రతుకుపాఠంలో
గుణపాఠమై వో అధ్యాయాన్ని ఆక్రమించావు!
కాలగమనంలో మనం తారసపడ్డా
బంధమంటూ ఏర్పరుచుకోలేని ఈ సాంగత్యంలో
కలలోనైనా ఇంకెప్పటికీ నిన్ను కలవలేను....
అర్థంచేసుకోవడానికి సంవత్సరాలు
మర్చిపోవడానికి యుగాలను వెచ్చించడానికి
నా జీవితాన్ని నీ వయస్సుతో హెచ్చించలేను....
నన్ను క్షమించు నేస్తమా!
సుతిమెత్తని నీ సంస్కారంతో నన్ను గేలిచేయకుండా
భవిష్యత్తులో నన్నింకోసారి ఓడిపోనివ్వకుండా
మొత్తానికి నువ్వే నెగ్గావ్...
ఇంకెప్పుడూ నేనే గెలుస్తానన్న భరోసా మాత్రం
నీకు తెలియకుండా నా అణువణువూ నింపేశావ్...